NTV Telugu Site icon

గ్రామస్తులు వోటింగ్ బహిష్కరణ.. ఎమ్మెల్యే బియ్యపు కీలక వ్యాఖ్యలు !

ఇవాళ  తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నికలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు.  మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.  శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు గ్రామస్థులు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరూ రాక బోసిపోయింది ఊరందూరు పోలింగ్ స్టేషన్. ఇప్పటికీ ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది.  ఓటింగ్ బహిష్కరించడమే గాక..తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో కలపడంపై నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపబోమని రాతపూర్వక హామీ కోరుతున్నారు గ్రామస్థులు.  అయితే ఈ అంశం మీద ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థి నచ్చకపోతే నోటా కి ఓటు వేసుకో వచ్చు…కానీ వోటింగ్ కి రాకుండా ఉండడం తగదని హితవు పలికారు  స్థానిక ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి.  గత ప్రభుత్వ హయాంలో ఊరందూరును శ్రీకాళహస్తి లో కలిపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు.  గ్రామస్థులు తీసుకున్న నిర్ణయంలో బొజ్జల కుటుంబం చేస్తున్న రాజకీయం కనిపిస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే.