Mandous Cyclone Effect In Tirupati Chittoor Districts: మాండూస్ తుఫాన్ కారణంగా తిరుపతి, చిత్తూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 80 కిలోమీటర్ల గాలులతో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తుండటంతో ఆ రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఎక్కడికక్కడ చెట్లు, హోర్డింగ్‌లు నేలరాలాయి. చెరువలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలోని నాయుడు పేట, సూళ్లూరు పేట, తడ, దొరవారి సత్రం, పెళ్లకూరు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నారు. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కెనాడీ నగర్‌లో ఇళ్లన్నీ వరద నీరుతో నిండిపోవడంతో.. కాలనీ వాసులు రోడ్డు మీదకి వచ్చారు. కొంతమంది ఇళ్లల్లోనే చిక్కుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు.
ఆర్టీసి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. శ్రీవారి భక్తులకూ ఇబ్బందులు తప్పట్లేదు. పులికాట్ సరస్సుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు తమ పడవల్ని తీరం నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూడు పడవలు నీట మునిగిపోయాయి. నాయుడుపేట ప్రాంతంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తూపిలి పాలెం బీచ్‌లో అలలు ఎగిసిపడుతున్నాయి. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. గూడూరులోని పంబలేరులో కూడా ప్రవాహం పెరిగింది. అటు.. ఉమ్మడి కడప జిల్లాపై కూడా ఈ తుఫాను ప్రభావం చూపుతోంది. కడప, రాజంపేట, కోడూరు, మైదుకూరు, జమ్మలమడుగులలో నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ దెబ్బకు కోడూరులో జాతీయ రహదారి వర్షపు నీరుతో నిండిపోవడంతో, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఆకాశం మేఘావృతంగా మారింది. పలు కోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో.. ధాన్యం అమ్మకాలు ఇంకా పూర్తి కాని వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఓడలరేవు, అంతర్వేది సముద్ర తీరంలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు.. నెల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో 10 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైంది. వరద నీరు భారీగా వచ్చి చేరిన నేపథ్యంలో.. సోమశిల జలాశయం నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి నీరు వస్తే.. మరింత విడుదల చేస్తామని అధికారుల సూచించారు. ఈ నేపథ్యంలోనే పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కండలేరు జలాశయం వద్ద పరిస్థితిని జనవనరుల శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి పంటలకు నష్టం లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యానవన పంటలకు ఈ వర్షం కాస్త ప్రయోజనం కలిగించింది. మరింత వర్షం కురిస్తే, నారుమళ్లు నీట మునిగే ప్రమాదం ఉంది. మైపాడు, కోడూరు, తుమ్మలపెంట బీచ్‌ల వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ దృశ్యాలు వీక్షించేందుకు పర్యాటకులు తీరం వద్దకు తరలి వచ్చారు. అయితే.. ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తీరం వద్దకు ప్రజలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నై.. విజయవాడ మార్గంలో రైల్వే ట్రాక్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తుఫాను తీరం దాటినప్పటికీ.. రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
