Fighting Roosters Theft: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బరులు కూడా సిద్ధం అవుతున్నాయి.. అయితే, ఈ తరుణంలో కృష్ణా జిల్లాలో పందెం కోడి పుంజుల చోరీలు కలకలం రేపుతున్నాయి. పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో 10 పందెం కోడి పుంజులు చోరీకి గురికావడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
Read Also: Malayalam : మోహన్ లాల్ సినిమా ‘వృషభ’ను పట్టించుకోని మలయాళీలు
బంటుమిల్లి గ్రామానికి చెందిన ర్యాలీ సత్యనారాయణ తన ఇంటి సమీపంలోని కోళ్ల షెడ్‌లో విలువైన పందెం కోళ్లను పెంచుతున్నారు. శనివారం అర్ధరాత్రి తాళం పగలగొట్టి, రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య, మాస్కులు ధరించిన దుండగులు షెడ్‌లోకి ప్రవేశించి.. 10 పందెం కోడి పుంజులను ఎత్తుకెళ్లినట్టు బాధితుడు తెలిపారు. చోరీకి గురైన కోడిపుంజుల విలువ సుమారు రూ.6,00,000 వరకు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సీజన్ కావడంతో పందెం కోళ్లకు భారీ డిమాండ్ ఉంది. అందుకే వరుసగా చోరీలు జరుగుతున్నాయి. కోళ్లను ప్రేమగా పెంచుకున్నాం.. ఇప్పుడు ఒక్కసారిగా పోగొట్టుకోవడంతో షాక్‌లో ఉన్నాం అని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇక, ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షెడ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని, దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. మద్యం, నగదు, నగల తరహాలో కాకుండా.. పందెం కోడి పుంజులే లక్ష్యంగా దాడి జరగడం వెనుక స్థానిక ముఠా హస్తం ఉండొచ్చన్న కోణంలో విచారణ సాగుతోంది. ఇదే తరహాలో వారం రోజుల క్రితం కృత్తివెన్ను మండలం సమీపంలో 4 కోడి పుంజులు చోరీకి గురికాగా, పోలీసులు అప్పుడే కేసు నమోదు చేశారు. తాజాగా 10 కోడిపుంజుల చోరీతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పండుగ సీజన్ గిరాకీని ఆసరాగా తీసుకుని పందెం కోళ్లను దొంగిలించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పందెం కోళ్లకు గిరాకీ మరింత పెరుగుతుండటంతో.. కోడి పుంజుల యజమానులు షెడ్‌ల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసులో త్వరలో కీలక అరెస్టులు ఉండొచ్చని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
