Site icon NTV Telugu

Konaseema: అంబేద్కర్ ఫొటో వివాదం.. పోలీస్‌ స్టేషన్‌లోనే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరసన

Mla Jaggireddy

Mla Jaggireddy

కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో టిఫిన్‌ ప్లేట్‌పై అంబేద్కర్‌ ఫొటోను ప్రింట్‌ చేసిన వివాదం ఇంకా చల్లారలేదు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. గంటలకొద్ది రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌లోనే ఉండిపోయారు. ఈ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవలో పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్లందరూ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయటం పట్ల ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్‌ఐ, సీఐలను సస్పెండ్ చేసే వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంటానని భీస్మించుకొని కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్యేకి మద్ధతుగా వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. డీఎస్పీ మాధవరెడ్డి ఎమ్మెల్యేకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు, ఉన్నతాధికారులు తనకు సరైన హామీ ఇవ్వకపోవడంతో రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌లో నిరసన కొనసాగిస్తానని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆదివారం ప్రకటించారు. వైసీపీ దళిత నేతలు శాసన సభ్యుడికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.

గతంలో కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు ప్రతిపాదనపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావటంతోపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ గొడవ ఎట్టకేలకు సద్దుమణిగింది. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును ఖరారు చేసింది. తాజాగా టిఫిన్‌ ప్లేట్‌పై అంబేద్కర్‌ ఫొటోను ప్రింట్‌ చేయటం మరోసారి ఘర్షణకు దారితీసింది.

Exit mobile version