Minister Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారు నారా లోకేష్.. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్ర కూడా దోహదం చేసింది.. ఇప్పుడు మరోసారి తన పాదయాత్ర గురించి గుర్తుచేసుకున్న మంత్రి నారా లోకేష్.. పాదయాత్ర తన జీవితాన్నే మార్చేసిందని, సమాజం నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం దక్కిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూ (JNTU)లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని, అదే తన ఆలోచనా విధానంలో పెద్ద మార్పుకు కారణమైందని లోకేష్ తెలిపారు. సమాజం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు. ఇక, పిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపై దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ ద్వారా వరదలను ముందుగానే అంచనా వేసే విధానాలపై పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాటను గుర్తు చేస్తూ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సివిల్ వర్క్స్ ప్రారంభించామని మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు లోకేష్. రాజకీయ జీవితానికి సంబంధించిన అనుభవాలను కూడా లోకేష్ ఈ సందర్భంగా పంచుకున్నారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడిని రిమాండ్‌కు పంపిన సమయంలో తమను పలకరించి, కుటుంబానికి అండగా నిలిచిన పవన్ కల్యాణ్ తీరు జీవితాంతం గుర్తుండిపోతుందని భావోద్వేగంగా చెప్పారు. విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, తాను పెద్దగా క్లాసులకు బంక్ కొట్టలేదని, దాదాపు 90 శాతం అటెండెన్స్ ఉండేదని తెలిపారు. బ్రాహ్మణి అయితే 100 శాతం అటెండెన్స్‌తో ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు.. కాకినాడ రూరల్ టీడీపీ కార్యకర్తల సమావేశంలో కూడా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు..
