NTV Telugu Site icon

Kadapa RIMS: చిచ్చురేపిన సీల్.. ఛాంబర్‌కు తాళాలు

Kdp Rims

Kdp Rims

కడప రిమ్స్ లో ప్రతీది వివాదమే అవుతోంది. తాజాగా రిమ్స్ డెంటల్ కాలేజిలో ప్రిన్సిపల్ ఛాంబరుకు సీల్ వేయడం, దాన్ని ఇవాళ పగులగొట్టడంతో పరిపాలనా పరంగా ఉన్న విభేదాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యమైన డాక్యుమెంట్లు కోసమే ఇలా సీల్ వేశామని చెబుతున్నారు. కడప రిమ్స్ దంత వైద్యశాల ఇన్చార్జిగా డాక్టర్ సురేఖ రెండు రోజుల క్రిందట బాధ్యతలు తీసుకున్నారు. అయితే డాక్టర్ యుగంధర్ ను ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

యుగంధర్ భాద్యతలు తీసుకునేందుకు వెళితే ప్రిన్సిపల్ ఛాంబరుకు సీల్ వేసి ఉంది. ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ ఆదేశాలమేరకే ఛాంబరుకు సీలు వేశామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. బాధ్యతలు తీసుకోవడానికి వెళితే ఆఫీసుకి సీలు వేసి ఉండటం పై డాక్టర్ యుగంధర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఇలా సీలు వేయమన్నారని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు.

దీంతో రిమ్స్ డెంటల్ కాలేజీలో తలెత్తిన వివాదం బహిర్గతం అయ్యింది. అయితే ముఖ్యమైన పత్రాలు ఉన్న గదుల తాళాలకు సీలు వేయడం మామూలేనని, శనివారం వేసిన సీలును, తాను అందుబాటులో లేకపోవడం వల్ల తన ఆదేశాల మేరకే తాళాలు పగులగొట్టి అవసరమైన పత్రాలు, రికార్డులు తీసుకున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ చెబుతున్నారు. రిమ్స్ లో తాళాలకు సీలు వేసే విధానం ఎప్పుడూ లేదని, ఎప్పుడు ఇందుకు ఇలా చేశారంటే సరైన సమాధానం సిబ్బంది నుంచి రావడం లేదు. పటిష్టమైన సెక్యూరిటీ ఉండే రిమ్స్ లో ఒక ఛాంబరుకు ఇలా సీలు వేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read also: Cellphone Suicides: ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ వివాదం