Kadana Penna River is Fierce: పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. అనంతపురంలో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా.. గండికోటలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట నుంచి మైలవరంకు 55 వేల క్యూసెక్కులు.. మైలవరం నుంచి పెన్నా నదికి 60 వేల క్యూసెక్కుల నీరుని విడుదల చేశారు. మైలవరం పూర్తి సామర్థ్యం 6.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. పరివాహన ప్రజలు బిక్కుబిక్కుమంటూ, ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకున్నారు.
ఈనెల 13వ తేదీ నుంచి గండికోట నుంచి మైలవరం జలాశయానికి అధికంగా నీటిని విడుదల చేయడంతో.. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో.. మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు వాసులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. ప్రధాన వంతెన వద్ద రెండు స్తంభాలపై నిర్మించే బరువైన సిమెంటు దిమ్మెలు నీటి ఉద్ధృతికి ఒరిగిపోయాయి. మరోవైపు.. మైలవరం జలాశయం నుంచి శుక్రవారం లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వార్తలు రాగా.. వాటిని నమ్మవద్దని ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు. అనుకోని పరిస్థితుల్లో గండికోట నుంచి వరద ఎక్కువగా వస్తే.. అందుకు తగిన ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ప్రజలు వదంతుల్ని పట్టించుకోవద్దన్న ఆయన.. అప్రమత్తగా ఉండాలని మరోసారి సూచించారు.