Turakapalem: గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని అధికారుల అధ్యయనంలో తేలింది. ఈ గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించిన చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి రిసెర్చ్ చేసింది. అయితే, చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు శనివారం నాడు వెల్లడైనట్లు సమాచారం. అందులో తురకపాలెం పరిసరాల్లోని జలాల్లో యురేనియం అవశేషాలు గుర్తించినట్లు తెలుస్తుంది. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండడంతో పాటు వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు పని చేయడం, క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో ఉపయోగించడంతో సమస్య ఉద్భవించినట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకం, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఇక్కడి నీటిలో ఉన్నట్లు వైద్య బృందం గుర్తించింది.
Read Also: Pawan Kalyan : ‘పప్పు’ స్టూడియోలో పవన్ కళ్యాణ్.. ఏం చేస్తున్నాడంటే?
మరోవైపు, తొలుత తురకపాలెం గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. చెన్నై రిపోర్టులో మాత్రం అందుకు భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయి. యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తాగునీరు, ఆహారం ద్వారా ఈ అవశేషాలు మానవ శరీరంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అలాగే, చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను పూర్తిగా నాశనం చేయడం ద్వారా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుందన్నారు.
