AP High Court: ఏపీ హైకోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుపై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నాలుగు రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం రాజధానిలో జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ దగ్గర హైకోర్టు ఫైల్స్ ను తీసుకెళ్తున్న వ్యాన్ ను కానిస్టేబుల్స్ అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు.
Read Also: Tamilnadu: తొక్కిసలాటకు స్టాలిన్ ప్రభుత్వమే కారణం- టీవీకే పార్టీ నేతలు
అయితే, కానిస్టేబుల్స్ పట్ల దురుసుగా ప్రవర్తించిన హైకోర్టు డ్రైవర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారని డ్రైవర్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ఎస్పీ వకుల్ జిందాల్ ను పిలిపించి వివరణ తీసుకుంది. ఈ సందర్భంగా డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, మంగళగిరి పీఎస్ లోనే సీఐ శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
