Four Loan Recovery Agents Arrested In Nellore: లోన్ రికవరీ ఏజెంట్ల అరాచకాలు రానురాను పెచ్చుమీరిపోతున్నాయి. వీళ్ల వేధింపులకు కొందరు ప్రాణాలు సైతం తీసుకున్నారు. చివరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ని వీళ్లు వదిలిపెట్టలేదు. తనకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ.. డబ్బులు కట్టాల్సిందేనంటూ టార్చర్ పెట్టారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరెవరు రెచ్చిపోయారు.. ఆ ఏజెంట్ల భరతం పట్టారు. నలుగురిని అరెస్ట్ చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు వెల్లడించారు.
‘‘లోన్ యాప్ ఏజెంట్లపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. తమకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ ఏజెంట్లు పట్టించుకోకుండా వేధిస్తున్నారు. ముత్తుకూరు, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లలో వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టగా.. కోల్ మాన్ రికవరీ సంస్థ నుంచి ఫోన్లు వచ్చినట్టు గుర్తించాం. పెంచల రావు, మాధురి, గురు ప్రసాద్ రెడ్డి, మహేంద్రన్ అనే నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశాం. వారి వద్ద నుంచి వివిధ సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్స్ గుర్తించి.. వాటిని అదుపులోకి తీసుకున్నాం. ఐటీ యాక్ట్‌తో పాటు ఇతర సెక్షన్లపై కేసులు పెట్టాం. ఇంటర్నెట్ ద్వారా ప్రముఖుల నంబర్ల తీసుకొని, లోన్ తీర్చాలంటూ టార్చర్ పెట్టినట్టు గుర్తించాం’’ అని ఎస్పీ విజయారావు వివరాల్ని తెలియజేశారు. రుణాలు తీసుకునే ముందు ప్రజలు అప్రమత్తగా ఉండాలని ఆయన సూచించారు.