CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు మార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి.. నిర్మాణ పనులను పర్యవేక్షించి.. కీలక ఆదేశాలు ఇస్తూ వచ్చిన ఆయన.. ఈ నెల జనవరి 7న పోలవరం ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు ఎల్లుండి ఉదయం 10.20 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను నేరుగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరుపుతారు. పోలవరం డ్యామ్, స్పిల్‌వే, కాలువలు, నిర్వాసితుల పునరావాస పనులు తదితర అంశాలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. సమీక్ష ముగిశాక మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం సీఎం విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో సీఎం ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి, రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
