‘ఆసరా’ రెండో విడత కార్యక్రమం అమలుకు ఎన్నికల కమిషన్ ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… ఇప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమం కావడంతో ఈసీ అంగీకారం తెలిపింది.. దీంతో.. రేపు ఒంగోలులో ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద రుణమాఫీ కార్యక్రమాన్ని అంజయ్య రోడ్డులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసు శిక్షణ కళాశాలలోని హెలీప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. రెండో విడత కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78.76 లక్షల మంది సభ్యులకు రూ.6,439 కోట్లు అందించనుంది.
ఆసరా కింద ఇచ్చే మొత్తాన్ని సభ్యులు ఎలా వినియోగించుకుంటారనే దానిపై ఎలాంటి షరతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల తర్వాత సీఎం.. జిల్లాకు రానుండటంతో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్ధానిక పీవీఆర్ హైస్కూల్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున పొదుపు మహిళల కోసం అమలు చేసే పథకాన్ని ఒంగోలులో ప్రారంభించడం అభినందనీయమన్నారు. రేపు ఉదయం 9.55 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలు పీటీసీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. 10.45 గంటలకు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. 11 గంటలకు పాఠశాలకు చేరుకుని స్టాల్స్ సందర్శన; రాష్ట్ర మంత్రుల ప్రసంగం, ఆసరా లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 12 నుంచి 12.30 గంటల వరకు సీఎం జగన్ ప్రసంగం కొనసాగనుంది.. 12.30కు వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభించనున్నారు. 12.45 గంటలకు పాఠశాల నుంచి బయలుదేరి 1.55 గంటలకు నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.