ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. ఆదోనీలో విద్వాదీవెన కిట్ల పంపిణీ ప్రారంభం అయింది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి నాడు నేడు కింద రూ. వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలతో విద్యార్ధుల చేరికలు భారీగా పెరిగాయి.
-
ఆదోనికి సీఎం వరాల జల్లు
పేదరికం జయించాలంటే మంచి చదువు కావాలి. పిల్లలు బాగుండాలని, వారి జీవితాలు బాగుండాలని మనసావాచా కర్మణా కోరుకుంటున్నాను. అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని, దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆదోనికి వరాలు ప్రకటించారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నాం. ఆటోనగర్ చేయిస్తాం అని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీల్లో బీటీ కాలనీలు ఇస్తాం. అదే విధంగా బుడగ జంగాలకు సర్టిఫికెట్లు ఇస్తాం. వన్ మేన్ కమిషన్ రికమండేషన్ ఇచ్చింది. దానిని ఎస్సీ కమిషన్ కి పంపాం. కేంద్రానికి తెలియచేశాం. బోయల విషయంలో ఇవే అడుగులు వేయబడతాయి. కేంద్రానికి పంపిస్తాం. ఆదోని రూరల్ లో తాగునీటి సదుపాయానికి సర్వే చేయిస్తాం. ఆదోని టౌన్ రోడ్లు విస్తరించడానికి 50 కోట్లు ఖర్చుచేస్తాం.అనంతరం జగనన్న కిట్లను విద్యార్ధులకు అందచేశారు. అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు.
-
ఒకసారి తేడా గమనించండి
చంద్రబాబు హయాంలో 500 కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజన పథకం కింద ఖర్చుచేశారు. అన్ని బకాయిలు పెట్టారు. దీంతో నాణ్యత లేకుండా పథకం అమలు జరిగింది. ఈ రోజు గోరుముద్దకు 1850 కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నాం. మంచి పౌష్టికాహారం కోసం చంద్రబాబు 500 కోట్లు ఖర్చుచేయలేకపోయారు. వైఎస్ ఆర్ సంపూర్ణ పోషణకు ఏడాదికి 1900 కోట్లు పెడుతున్నాం. విద్యాకానుక ద్వారా 931 కోట్లు ఖర్చుచేశాం. బైజూస్ ఒప్పందం, ట్యాబ్ ల కోసం 500కోట్లు ఖర్చుచేస్తున్నాం. గతంలో చంద్రబాబు హయాంలో 120 కోట్లు ఖర్చుచేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించండి. స్కూళ్ళలో టాయిలెట్ల కోసం నెలకు 10 శానిటరీ నాప్ కిన్స్ ఇచ్చేలా స్వేచ్ఛ పథకం తెచ్చాం.
-
ఇది జగనన్న సంకల్పం
ఏపీలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. బడి మానేసే పిల్లలు తగ్గాలి. చదువుకునే వారు పెరగాలి. పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రుల్ని ప్రోత్సహించాలి. పేదరికం అనే సంకెళ్లను తెంచుకోవాలి. ఆర్థిక అంతరాలు తగ్గాలి. ఇంగ్లీషు మీడియం చదువులు పేదింటి పిల్లలకు అందాలి. విద్యావిప్లవం ద్వారా మార్పులు రావాలి. ఇది జగనన్న సంకల్పం, మేనమామ సంకల్పం. గత ప్రభుత్వ హయాంలో 37 లక్షలమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు పెరిగారు. ప్రైవేటు బడులను మానేసి 7 లక్షలమందికి పైగా పెరిగారు. ప్రపంచంతో పోటీపడాలి. కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతుంది.
-
మూడో ఏడాది కిట్ వ్యయం రూ2 వేలు.. జగన్
47 లక్షలమందికి కిట్లు అందుబాటులోకి తెచ్చేందుకు 931 కోట్లు ఖర్చుచేస్తున్నాం. పిల్లల జీవితాలు మార్చేందుకు 8వ తరగతిలోకి అడుగుపెట్టబోయే వారికి ట్యాబ్ ఇస్తాం. అక్షరాల ట్యాబ్ విలువ 12 వేలు వుంటుంది. బైజూస్ ఒప్పందం ద్వారా కంటెంట్ ట్యాబ్ లో అనుసంధానం చేస్తాం. 2025 మార్చిలో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ ఇంగ్లీషు మీడియంలో రాస్తే వారు మంచి మార్కులతో బయట పడాలి. 8వ తరగతి నుంచే చేయిపట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు జగన్.
-
బైజూస్ తో ఒప్పందం చారిత్రాత్మకం
వేలాది రూపాయలు పెట్టి బైజూస్ కొనుక్కోలేనివారి కోసం ప్రత్యేక పథకం తెచ్చాం. బైజూస్ తో ఒప్పందం చారిత్రాత్మకం. బైజూస్ యాప్ అందుబాటులోకి తెచ్చాం, నవరత్నాల ద్వారా మంచి జరుపుతున్నాం. మరోవైపున రేపటి తరం కోసం ఆలోచించి వారిని జాగ్రత్తగా పైకి తీసుకురావాలి. పాఠాలు సులభంగా అర్థమయ్యేలా వుండాలి. విద్యాకానుక పిల్లల చేతుల్లో పెడుతున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వున్నవారికి ఉచితంగా విద్యాకానుక కిట్. బడికి వెళుతున్న పిల్లలకు బడుల్లో చక్కగా చదువుకునేందుకు కావల్సిన వస్తువులు కిట్ లో వుంచుతున్నాం. నాణ్యత తో కూడిన కిట్లను ఖర్చుచేస్తున్నాం.
-
పేదపిల్లలకు నాణ్యమయిన విద్య.. జగన్
దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చిక్కటి చిరునవ్వుతో పాలు పంచుకుంటున్నా. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మూడేళ్లుగా ప్రతి అడుగులోనూ మీ ప్రోత్సాహం కనిపిస్తోంది. ప్రతి పేదల ఇంట్లో మంచి చదువులు వుండాలి. పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. దేశమే కాదు ప్రపంచంలో బతికే అవకాశం వుంటుంది. గొప్ప ఆశయంతో అడుగులు వేస్తున్నాం. పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలుచేస్తున్నాం. మూడేళ్ళలో ఉద్యమంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. నాడునేడు ద్వారా బడుల్ని అభివృద్ధి చేస్తున్నాం. పిల్లలకు నాణ్యమయిన పౌష్టికహారం గురించి ఆలోచించలేదు. అది ఎంత అవసరమో ఆలోచించి జగనన్న గోరుముద్ద తెచ్చాం. ప్రతి పిల్లాడికి అందేలా చూస్తున్నాం. బడుల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చాం.
-
అది ఒక్క ఏపీకే వరం.. మంత్రి బొత్స
విద్యార్ధులకు వరంఈ పథకం. గతంలో తల్లిదండ్రులకు ఆందోళన వుండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. జగన్ ఈ బాధలు లేకుండా కిట్ ద్వారా అన్నీ అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తోంది. భారతదేశంలో ఇలాంటి పథకాలు మన రాష్ట్రంలోనే వున్నాయన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ. అమ్మ ఒడి వినూత్న కార్యక్రమం అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ. అక్టోబర్ నుంచి 8వ తరగతి చదివేవారికి ట్యాబ్ లు అందిస్తామన్నారు. విద్యలో వినూత్న మార్పులు వచ్చాయన్నారు. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు పెట్టాలని భావిస్తోంది. అందులో ఒకటి బాలికలకు ఒకటి వుంటుందన్నారు. డిగ్రీకాలేజీ అన్ని నియోజకవర్గాల్లో రావాలనేది జగన్ లక్ష్యమన్నారు.
-
ఆదోని సమస్యలు తీర్చండి.. ఎమ్మెల్యే
ఆదోని కి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు వచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ సీఎం హోదాలో వచ్చారు. ఆదోని సమస్యల్ని ఆయన దృష్టికి తెస్తున్నా. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుచేయాలన్నారు. ఆటో నగర్ కావాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి జగన్ ని కోరారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కావాలన్నారు. జగన్ కాలనీలకు రోడ్లు, మంచినీళ్ళు ఇవ్వాలన్నారు.
-
ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత జగన్ దే
విద్యారంగంలో సంస్కరణలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా 47 లక్షలమందికి పైగా విద్యార్ధులు ప్రయోజనం పొందుతారు. జగన్ ఆదోనికి రావడం సంతోషంగా వుందన్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఆదోనికి రావడంతో మంచిరోజులు వచ్చాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక పాదయాత్ర హామీలు నెరవేరుస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడంతో అంతా చర్చించుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజానురంజక పాలన సాగింది. రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ ఆయన బాటలోనే నడుస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా చేసినా జనం గురించి ఆలోచించలేదు. మేనమామగా జగన్ అందరినీ చదివించాలని పథకాలు చేపట్టారు. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నారు. మరో 30 ఏళ్ళు పాలించాలన్నారు.
-
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం
జ్యోతి ప్రజ్వలనతో విద్యాదీవెన కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పుష్పంజలి ఘటించారు. ఆదోని వేదికగా ఎంచుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది అవుతుందని అంటున్నారు.
-
విద్యార్థుల్ని ఆత్మీయంగా పలకరించిన జగన్
జగన్ విద్యాదీవెన పథకంలో భాగంగా విద్యాకానుక ఎలా ఉపయోగపడుతుందో విద్యార్ధినీ విద్యార్ధుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వారితో కలిసి కాసేపు ముచ్చటించారు. వారి పక్కనే కూర్చుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రావడంతో విద్యార్ధులు ఉద్వేగానికి గురయ్యారు. ఆదోని లో జగన్ రాకతో సందడి నెలకొంది. థ్యాంక్యూ జగన్.. జగన్ మామకు వందనం.. మీ పాలన మాకు వరం అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు.
-
సందేహాలుంటే.. ఫోన్ చేయొచ్చు
ఈ విద్యాకానుక వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలుంటే 9908696785 నెంబర్‌కు పనివేళల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే, cmo.apsamagrashiksha@gmail.com లేదా spdapssapeshi@gmail.comకు తెలియచేయాలన్నారు. విద్యార్ధులందరికీ నాణ్యమయిన కిట్లు అందుబాటులో వుంచారు. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. కానీ, ఈసారి అందరికీ ఒకేరకమైన బ్యాగులను అందిస్తున్నారు. అంతేకాక.. జనరల్ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్ పేజీలతో నోట్‌బుక్స్‌ను అందిస్తున్నారు.
-
ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 విలువైన కానుకలు
వివిధ కారణాల వల్ల విద్యార్ధులు నాణ్యమయిన పుస్తకాలు, బ్యాగ్ లు కొనుక్కోలేరు. అలాంటి వారి కోసమే ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని జగన్ చెప్పారు. ఈపథకం ద్వారా ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందుతాయి. 2020 –21 విద్యా సంవత్సరంలో 42,34,322 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 648.10 కోట్లు. 2021 –22 విద్యా సంవత్సరంలో 45,71,051 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 789.21 కోట్లు. 2022 –23 విద్యా సంవత్సరంలో 47,40,421 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. దానికి అయిన వ్యయం రూ. 931.02 కోట్లు. ఇదంతా కలిపి ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లు.ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్ధులు ఉత్సాహంగా స్కూళ్ళకు వస్తున్నారు.
-
సీఎం జగన్ కి ఘన స్వాగతం
జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఓర్వకల్లు విమానాశ్రయంలో పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్, డీఐజీ, మేయర్ తదితరులు స్వాగతం పలికారు.