యావత్తు ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా బారిన పడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ప్రజలు ఇప్పుడు థర్డ్‌వేవ్‌తో తలమునకలవుతున్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే కరోనా కష్టకాలంలో సైతం నిర్వారామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు.
ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా బారినపడగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న సీఐ, ఎస్సైలతో పాటు 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. అంతేకాకుండా మిగితా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.