NTV Telugu Site icon

మరో వివాదంలో చిక్కుకున్న చీరాల పోలీసులు !

ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు మరో వివాదంలో చిక్కుకున్నారు.  తన ఆత్మహత్యకు చీరాల వన్‌టౌన్ సిఐ రాజమోహనే కారణమంటూ రవీంద్రబాబు అనే వ్యక్తి తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. చీరాల బోస్‌నగర్‌కు చెందిన రవీంద్రబాబు గత నెల 19న  ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి అప్పుల  బాధ కారణమంమూ  పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రవీంద్రబాబు  చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో దొరకడంతో అసలు విషయం బయటకు వచ్చింది.  రవీంద్రబాబుకు స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.  తన భార్య నగలు ఆ మహిళకు ఇచ్చాడు  రవీంద్రబాబు. ఆ తరువాత కొన్ని రోజులకు  వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో తన భార్య నగలు తిరిగి ఇచ్చేయాల్సిందిగా సదరు మహిళపై ఒత్తిడి చేశాడు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మహిళ. విచారణ కోసమని స్టేషన్‌కు పిలిపించిన సీఐ రాజమోహన్‌ తనను దుర్భాషలాడటమే కాకుండా బూటు కాలితో తన్నాడని సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు రవీంద్రబాబు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా సీఐ చెప్పనివ్వలేదని ఆవేదన చెందారు. ఇప్పుడీ వీడియో వెలుగులోకి రావడంతో రవీంద్రబాబు ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు .