BJP Satya Kumar Challenges AP CM YS Jagan Mohan Reddy: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అమరావతికి ఆయన నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. కరోనా సమయం నుండి ఇరవై కోట్ల మంది పేదలకు కేంద్రం బియ్యం ఉచితంగా అందిస్తోందని.. మరో మూడు నెలలు బియ్యం ఇచ్చేవిధంగా ఈ పథకాన్ని పొడిగించారని అన్నారు. అయితే.. ఈ బియ్యాన్ని రాష్ట్రంలో పేదలకు ఇస్తున్నారా లేదా అక్రమంగా విక్రయిస్తున్నారా అన్నది అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. బియ్యాన్ని ఆధికార పార్టీ నేతల ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారని.. ఈ విషయంపై సీఎం సలహాదారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలకు సీఎం దర్శన భాగ్యం కలిగిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేసినట్లు జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు తన నియోజకవర్గానికే ఆయన ఎన్నిసార్లు వెళ్లారో చెప్పాలని తాను సవాల్ చేస్తున్నానన్నారు. గడపగడపలో ప్రజల నుండి ఎమ్మెల్యేలు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారన్నారు.
జగన్ గ్రాఫ్ పడిపోతోందన్న సత్యకుమార్.. ఆ విషయాన్ని దాచిపెట్టి, ఎమ్మెల్యేలపై సీఎం నెపం మోపుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన ఇళ్ళను పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని.. ఉత్తుత్తి సమీక్షలు నిర్వహిస్తోందని అన్నారు. 60 శాతం మాత్రమే ఈ-క్రాప్ పూర్తయ్యిందని, ఈ-క్రాప్ చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అధికార వైసీపీ ఖాతాలో లెక్కకు మించి వైఫల్యాలున్నాయని.. ఒక్క పరిశ్రమ తీసుకురావడం గానీ, ఒక్క ఉద్యోగం ఇవ్వడం గానీ లేదన్నారు. నిరుద్యోగులు వలస పోతున్నారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను సొంత ఖజానాకు తరలించుకుంటున్నారని ఆరోపణలు చేశారు. విమర్శను భరించలేని వ్యక్తి సీఎంగా ఉన్నారని.. సమావేశం పెడితే అనుమతి ఇవ్వకపోవడం, కరెంటు కట్ చేయడం వంటి చౌకబారు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో బీజేపీ ప్రచార రథాన్ని తగులబెట్టిందెవరో నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వమమేనని.. ఈ కేసుని తేల్చాల్సిందిగా తాను డీజీపీ, సీఎంను హెచ్చరిస్తున్నానన్నారు.
హైకోర్టు తరలించాలన్న ప్రయత్నమే చేయడం లేదని, సీఎం ఒక్క ఉత్తరం కూడా రాయలేకపోతున్నారని సత్యమోహన్ తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రను దండయాత్ర అంటూ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని.. ఉత్తరాంధ్రలో వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందన్న భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చి వితండవాదం చేస్తున్నారని.. పేరు మార్చాలనుకంటే జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రజాపోరు పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇక పొలిటికల్ ఇమ్మెచ్యూర్ అంటేనే రాహూల్ గాంధీ అని సెటైర్లు వేశారు.