Site icon NTV Telugu

BJP: ఏపీ సీఎం జగన్‌కు జీవీఎల్ సవాల్.. అంత ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి

Bharatiya Janata Party

Bharatiya Janata Party

ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని, మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని.. నిజంగా ఆ ధైర్యం ఉంటే..అసెంబ్లీని రద్దు చేయాలని జగన్‌ను సవాల్ చేస్తున్నట్లు జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. వైసీపీ ప్లీనరీలో జగన్ ఈ విషయం గురించి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వైసీపీ అంటే గోల్‌మాల్ పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారని.. రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగుతోందని.. జగన్‌ది దుర్మార్గమైన పాలన అని జీవీఎల్ ఆరోపించారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

అటు ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపైనా జీవీఎల్ స్పందించారు. రెండు నెలల్లో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచారని.. కేంద్రం డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచడమేంటని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి రూ. 800 కోట్లు లాగేయటం దారుణమని మండిపడ్డారు. అడిగితే సాంకేతిక లోపం అంటున్నారని.. అప్పు పుట్టని రోజు ఏదో ఒక అకౌంట్లోకి దూరి లాగేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఎమ్మెల్యేల అకౌంట్లలో సొమ్ములకు సాంకేతిక లోపం ఎందుకు జరగడం లేదని నిలదీశారు. వెంటనే లాగేసిన సొమ్ము అకౌంట్లలో తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుంది అని అంటున్నారని.. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవన్నారు. ఈ ర్యాంకింగ్స్ విధానాన్ని పునః సమీక్షించాలని జీవీఎల్ కోరారు. ఎఫ్ఆర్‌బీఎం ఆంక్షలకు లోబడి రాష్ట్రాలు అప్పులు చేయాలని హితవు పలికారు. కానీ కొన్ని రాష్ట్రాలు కళ్లు కప్పి రుణాలు తీసుకుంటున్నాయన్నారు. దీనికి‌ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రేక్ వేసిందని జీవీఎల్ పేర్కొన్నారు.

Exit mobile version