Bank Recovery Agents Tortured MLA Anil Kumar Yadav: ఈమధ్య లోన్ రికవరి ఏజెంట్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డబ్బులు తిరిగి కట్టకపోతే.. ఆ వ్యక్తుల్ని లేదా ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్లు చేసి రాబందుల్లా పీక్కు తింటున్నారు. లోన్ డబ్బులు కట్టాల్సిందేనంటూ రాచి రంపాన పెడుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ని సైతం వేధించారు. లోన్ తీసుకున్న వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని, దయచేసి తనకు ఫోన్లు చేయొద్దని మర్యాదపూర్వకంగా మాట్లాడినా.. పదే పదే ఫోన్లు చేసి టార్చర్ పెట్టారు.
తొలుత ఫుల్లర్‌టన్ బ్యాంక్ నుంచి ఓ మహిళా ఏజెంట్ ఫోన్ చేసి.. పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి మీ ఫోన్ నంబర్‌ను ప్రత్యామ్నాయంగా ఇచ్చారని, ఆయన తీసుకున్న లోన్ మీరే కట్టాలని చెప్పింది. అతనెవరో తెలియదని, కావాలంటే కేసు పెట్టి ఆ వ్యక్తిని జైల్లో పెట్టుకోండని చెప్పారు. అప్పుడు మరో మహిళా రికవరి ఏజెంట్ ఫోన్ అందుకొని, బెదిరింపులకు దిగింది. తనకెవరో తెలియదని చెప్తున్నా.. ఆ అశోక్, మీరు కలిసి తిన్న రూ. 8 లక్షలు ఎవరు కడతారు? కట్టాల్సింది మీరేనంటూ దబాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనిల్ కుమార్.. చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయ్యారు. అందుకు తనకూ మాట్లాడ్డం వచ్చని ఆ మహిళ రెచ్చిపోయింది.
అప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ పెట్టేసి సైలెంట్ అయితే.. 20 సార్లకు పైగా ఫోన్ చేసి ఆ మహిళ హింసించింది. డబ్బులు కట్టేదాకా ఫోన్ చేస్తూనే ఉంటానంటూ మొండికేసింది. ఈ వ్యవహారం తెగేలా లేదనుకున్న అనిల్ కుమార్.. తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్నారు. ఆ బ్యాంక్ వివరాలు సేకరించి, పోలీసుల్ని పంపించారు. ఆ ఏజెంట్లకు బేడీలు వేసి, లోపలేశారు. అప్పటివరకూ తాము మాట్లాడింది ఎమ్మెల్యే అనిల్ కుమార్‌తోనని వాళ్లూ గ్రహించలేకపోయారు.