NTV Telugu Site icon

AP and Telangana: విభజన సమస్యలు.. కొన్నింటిపై ఏకాభిప్రాయం..!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని ఏపీ పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ఆంధ్ర సర్కార్‌ వేసిన కేసులు ఉపసంహరించుకుంటే ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు సిద్ధమని ఈ సందర్భంగా వెల్లడించింది టీఎస్‌ సర్కార్.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల విషయంలో లోపాల తొలగింపు, నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, ఏపీ, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల క్యాష్ క్రెడిట్ వ్యవహారంపై కీలక చర్చలు సాగాయి..

Read Also: Punjab: రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే అమరీందర్‌ సింగ్‌ తొలగింపు..!

కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన విభజన అంశాలపై జరిగిన సమావేశంలో.. విద్యుత్ బకాయిలపై APGENCO – కోర్టు కేసును ఉపసంహరించుకుంటే, ఏపీ పవర్ యుటిలిటీస్, టీఎస్‌ పవర్ యుటిలిటీల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వివాద పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది తెలంగాణ.. ఇక, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు కేసులతో సహా పై మూడు సమస్యల కారణంగా APSFC విభజన సమస్య పెండింగ్‌లో ఉంది.. అందువల్ల, కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప, APSFC విభజనపై మరింత పురోగతి సాధించలేమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు.. పన్ను బకాయిల అసాధారణతను తొలగించడంపై జాయింట్ సెక్రటరీ (సెంటర్-స్టేట్), MHA తెలంగాణ అభిప్రాయాలను అంగీకరించారు.. ఈ సమస్య ద్వైపాక్షిక సమస్య కాదని నిర్ణయించారు… సమస్యను తొలగించడానికి అంగీకరించారు. ఇక, నగదు నిల్వ మరియు బ్యాంకు డిపాజిట్ల విభజనపై.. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలను పంపాలని జాయింట్ సెక్రటరీ (సీఎస్) తెలంగాణకు సూచించారు.. పౌర సరఫరాల కార్పోరేషన్ బకాయిల వివాదంలో కేంద్ర ప్రభుత్వం నుండి అందిన సబ్సిడీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ పౌర సరఫరాల కార్పోరేషన్ ఒప్పుకుంది.. రూ. 354 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించింది.. ఈ రోజు కేంద్ర హోంశాఖ సమావేశంలో ఐదు అజెండా అంశాల్లో ఒక అంశం ఇరు రాష్ట్రాలకు సంబంధించినది కాదని… తెలంగాణ వాదన తరవాత తొలగించారు.. మరో అంశం పై ఏకాభిప్రాయం రాగా… మరో రెండు అంశాలు ఏపీ కోర్టు కేసులు ఉప సంహఠించుకుంటే పరిష్కరించుకోవడానికి సిద్ధం అని తెలంగాణ తెలిపింది.