Andhra Pradesh: ఏపీ మంత్రుల బృందం ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా నామీ ద్వీపం సీఈవో మిన్ క్యోంగ్ వూతో రాష్ట్ర మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. సహజసిద్ధమైన సాంస్కృతిక, సాంప్రదాయ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన నామీ ఐలాండ్‌ను వారు సందర్శించారు. అయితే, సియోల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటైన నామీ ఐలాండ్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో పాటు సంవత్సరం మొత్తం సంగీత ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
Read Also: CM Revanth: పదేళ్లు నాకు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ కి పోటీగా తయారు చేస్తా
అలాగే, నామీ ఐలాండ్ అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునే చర్యలపై నామీ ద్వీపం సీఈవోతో మంత్రి నారాయణ చర్చించారు. సుమారు 4,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో నిండిన నామీ ద్వీపం మోడల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని పరిశీలిస్తున్నారు. ఇక, అమరావతిని బ్లూ- గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంలో నామీ ఐలాండ్‌లో అనుసరించిన విధానాలను పరిగణనలోకి తీసుకోవాలనే ప్రయత్నంలో ఏపీ సర్కార్ ఉంది.
