NTV Telugu Site icon

Andrapradesh : తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..

Accident

Accident

మృత్యువు ఎప్పుడు ఎలా వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం.. టైం వస్తే ఎలాగైనా పోవాల్సిందే.. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎ ప్రమాదం ముంచుకోస్తుందో అంచనా వెయ్యలేం.. ఓ వ్యక్తి కొత్త కారు కొన్న సంతోషంలో ఫ్రెండ్స్ కు దావత్ ఇవ్వాలని అనుకున్నారు.. అదే ఆనందం అతని ప్రాణాలను తీసింది.. కొత్త కారులో బయలు దేరిన ఫ్రెండ్స్ మరణంలో కూడా తోడుగా వెళ్లారు.. ఈ దారుణ రోడ్డు ప్రమాదం అనంతపురంలో వెలుగు చూసింది.. అతి వేగం ప్రాణాలను తీసింది.. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలను విడిచారు..

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతిచెందగా ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితులకు నిన్న రాత్రి పార్టీ ఇచ్చారు..

ఫ్రెండ్స్ అంతా ఫుల్ తినేసి ఎంజాయ్ చేసి ఆ ఆనంద సమయాలను గుర్తు చేసుకుంటూ తిరిగి ప్రయాణం చేశారు.. తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డి తో పాటు విష్ణువర్ధన్‌, నరేశ్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు శ్రీనివాసరెడ్డి గాయపడ్డాడు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు… మద్యం మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు..