Site icon NTV Telugu

Andhra pradesh: ఏపీలో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు వర్ష సూచన..

Rains Hyderabad

Rains Hyderabad

గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.. తెలంగాణ లో రోజు వర్షాలు కురుస్తున్నాయి.. ఏపీ లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.. బంగాళాఖాతం లో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.. తాజాగా వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనపై మరో అప్డేట్ ను ఇచ్చారు..

ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతం లో ఎల్లుండి మరో ఆవర్తనం.. 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు..నైరుతి రుతుపవనాల కారణంగా కోస్తాతో పాటు సీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. కామవరం దగ్గర గుబ్బల మంగమ్మ గుడి రహదారి మూసివేశారు అధికారులు. ఉత్తర కోస్తా, యానాం లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది..

ఇక కోనసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇకపోతే ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు మందగించాయి. చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూసే పరిస్థితు లు ఏర్పడ్డాయి. దాంతో.. వర్షాలు కురవాలంటూ జనం పూజలు చేస్తున్నారు.. కర్నూలు, కడప వంటి ప్రాంతాల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు..

Exit mobile version