YS Sharmila: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల నష్టానికి “తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది” అని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు బాధాకరమనీ, ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగానేవున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతాయని, ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతారాహిత్యాన్ని చూపుతున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Read Also: Modi Farming Mantra: ‘‘ఒక ఎకరం-ఒక సీజన్’’.. సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం..
అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను నింపే ప్రయత్నం అంగీకారయోగ్యం కాదు అన్నారు వైఎస్ షర్మిల.. ఉప్పునీటి ముప్పు కారణంగానే చెట్లు కూలిపోతున్నాయి.. కోనసీమలో శంకరగుప్తం డ్రెయిన్‌కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సముద్రం నుంచి పైకివస్తున్న ఉప్పునీటి ప్రవాహం, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం, దీర్ఘకాలిక శ్రద్ధ లేకపోవడం వల్ల లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు షర్మిల.. అయితే, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదు అన్నారు.. కొబ్బరి రైతులకు వెంటనే ఉపశమనం కల్పించాలి.. కోనసీమ రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని.. ఉప్పునీటి ముప్పును నివారించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలి.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలి.. రూ.3,500 కోట్లు కేటాయించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.. కోనసీమ కొబ్బరి చెట్లపై కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల..
