Nara Lokesh Foreign Tour: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి జరుగుతూనే ఉంది.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు.. తమ రాష్ట్రంలో ఉన్న వనరులను వివరిస్తూ.. పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్ బృందం పలు దేశాల్లో పర్యటించగా.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు.. ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు విదేశీ పర్యటనకు కొనసాగనుంది.. ఈ నెల 10 వరకు అమెరికా మరియు కెనడాలో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, కీలక సంస్థలతో సహకార అవకాశాలను పరిశీలించడం ఈ టూర్ ప్రధాన ఉద్దేశ్యం.
డల్లాస్‌లో సమావేశం
తన పర్యటనలో భాగంగా ఇవాళ డల్లాస్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. స్థానిక తెలుగు సంఘాలు, ఐటీ ప్రొఫెషనల్స్‌తో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై ఆయన చర్చించనున్నారు. ఇక, ఈ నెల 8, 9 తేదీల్లో మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. టెక్నాలజీ, స్టార్టప్‌లు, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే ఈ సమావేశాల లక్ష్యం.
కెనడా పర్యటన
అమెరికాతో పాటు కెనడాలోనూ పర్యటించనున్నారు మంత్రి నారా లోకేష్.. తన పర్యటన చివరి రోజు అయిన ఈ నెల 10న టోరంటో నగరంలో లోకేష్ పర్యటించనున్నారు. కెనడా-ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంబంధాలను మెరుగుపరచడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
