Deputy CM Pawan Kalyan: అడవిపై ఆధారపడి బతికే గిరిజనులకు ఆదాయ మార్గాలు పెంచే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, ఉద్యోగావకాశాల పెంపు వంటి కీలక అంశాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే దిశగా పలు ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Bengal: వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే.. బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
అడవిపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు సరైన ఆదాయ మార్గాలు సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్.. అటవీ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. గిరిజనులను ఈ రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఎకో టూరిజం పెంపు ద్వారా గిరిజనులకు ప్రత్యక్షంగా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అద్భుతమైన ప్రకృతి సోయగాలు, జలపాతాలు, అరణ్యాలు, కొండ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని సూచించారు.
ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలి
ఎజెన్సీ ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు మంచి అవకాశాలు ఉన్నందున వాటిని ఉపాధి హామీ పథకం (NREGS/MGNREGA) తో అనుసంధానం చేస్తే రైతులకు, కార్మికులకు గొప్ప లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్.. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగితే ఉపాధి కూడా పెరుగుతుంది. ఈ రెండు రంగాలను కలిపితే ఏజెన్సీలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది అని అన్నారు.
గిరిజన యువతకు ఉద్యోగాలు.. సినిమా, OTT షూటింగ్స్‌కు ప్రోత్సాహం..
ఏజెన్సీ ప్రాంతాల అందాలను వినియోగించుకునేలా అక్కడ సినిమాలు, సీరియల్లు, ఓటీటీ ప్రాజెక్టుల షూటింగ్స్‌కు ప్రోత్సాహం ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇది గిరిజన ప్రాంతాల ప్రచారానికి, అలాగే స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలకు దోహదం చేస్తుందని తెలిపారు. ఇక, గంజాయి సాగు నిర్మూలన అంశంపై కూడా పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గిరిజనులు ఈ అక్రమ వ్యవసాయంలోకి వెళ్లకుండా, వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధులు కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధిపై నెలవారీ రిపోర్టులు తప్పనిసరి
గిరిజన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులు ప్రతి నెల రిపోర్ట్ సమర్పించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమన్వయంతో, కట్టుదిట్టంగా పనిచేస్తే గిరిజనుల జీవనచిత్రం పూర్తిగా మారుతుంది అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇది మొత్తం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చూపుతున్న కొత్త దిశను ప్రతిబింబిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
