Site icon NTV Telugu

Botsa Satyanarayana: బడ్జెట్‌ అంకెల గారడీ.. అంతా మోడీ, చంద్రబాబు, పవన్, లోకేష్ డబ్బా..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లగా అంచనా వేశారు. అయితే, వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసనమండలి మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్ ప్రజల ఆశలను నెరవేర్చలేదని ఆరోపించారు.

బడ్జెట్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని, కానీ 1 నుంచి 8 పేజీల వరకూ ప్రభుత్వం తమను తాము పొగడుకోవడానికే, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఉపయోగించిందని అన్నారు బొత్స… ప్రజలు అభివృద్ధి కోసం అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం అభివృద్ధి కంటే పేర్ల ప్రస్తావనలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్ పేర్లే పదేపదే ప్రస్తావించారని.. వాళ్ల డబ్బా కొట్టుకున్నారని బొత్స ఆరోపించారు. రైతులకు మద్దతు ధరపై ఎక్కడా స్పష్టత లేదని, సున్నా వడ్డీ రుణాలపై కేటాయింపులు కనిపించడం లేదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు సమయానికి అందించామని, ఇప్పుడు వాటి ఊసే లేదని అన్నారు. పనికి ఆహార పథకానికి తగిన కేటాయింపులు లేవని కూడా విమర్శించారు.

అప్పుల విషయంలో ప్రభుత్వం గణాంకాలతో గారడీ చేస్తోందని ఆరోపించారు బొత్స.. గత వైసీపీ హయాంలో రూ.3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని మీరే చెప్పారని, ఇప్పుడు రూ.9 లక్షల కోట్లు చేశారని చెప్పడం అబద్ధమని అన్నారు. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చామని చెబుతున్నా, ఒక్క కౌలు రైతుకైనా నష్టపరిహారం అందించారా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ వల్ల సమాజంలోని ఏ వర్గానికీ ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ అంశాలన్నింటిపై మండలిలో పోరాడతామని, అధికార పక్షాన్ని నిలదీసి సమాధానాలు రాబడతామని స్పష్టం చేశారు. దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పినా, ఇప్పుడు అదే విషయంపై అధికార పక్షం డిఫెన్స్‌లో పడిందని బొత్స వ్యాఖ్యానించారు. మొత్తానికి, ఈ బడ్జెట్ “అంకెల గారడీ”తో నిండిపోయిందని, ప్రజలకు ఉపయోగపడే స్పష్టమైన ప్రణాళికలు లేవని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Exit mobile version