Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్ట్‌.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి.. డిప్యూటీ సీఎం ఆదేశాలు..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ.. కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు సూచనలు చేశారు. మంగళవారం వెళగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు ప్రణాళికలు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు.

Read Also: Tollywood: బాక్సాఫీస్ సునామీ: 10 రోజులు – 5 సినిమాలు – 800 కోట్లు!

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపు ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.. రాష్ట్రం మొత్తం భూ భాగంలో 2047 నాటికి 50 శాతం పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37 శాతం పచ్చదనం నింపాల్సి ఉందన్నారు.. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం గ్రీనరి ఉండగా.., వచ్చే నాలుగేళ్లలో మరో 7 శాతం గ్రీనరీ పెంచాల్సి ఉంది. అందుకోసం 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలని పిలుపునిచ్చారు.. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాల్సి ఉంది. అందులో ఉద్యానవన శాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాల్సి ఉంది.. ప్రతి మొక్కా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడాలి.. వీటితోపాటు అటవీ, పర్యావరణ శాఖలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు, నీటిపారుదల శాఖ, పాఠశాల విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న రైల్వే తదితర శాఖలు తమ తమ పరిధిలో లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

జాతీయ రహదారులకి ఇరువైపులా మొక్కలు నాటే సంప్రదాయం ఉంది.. దీన్ని రాష్ట్ర పరిధిలోని రహదారుల నిర్మాణంలోనూ అమలు చేయాలి అన్నారు పవన్‌.. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కూడా గ్రీన్ కవర్ పెంపునకు దోహదపడుతుంది.. 970 ఎకరాల తీర ప్రాంతం వెంబడి 40 శాతం అటవీ శాఖ పరిధిలో ఉండగా, మిగిలిన భూభాగంలో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరం అయిన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాలి. తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతంలో అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలి. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలి. కాలువగట్లు, చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలి. మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా చూసుకోవాలి. అందుకు సంబంధించి శాఖల వారీ యాక్షన్ ప్లాన్ అవసరం అన్నారు.. నిర్దేశిత సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయండి. బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రి తో చర్చిస్తాం.. లక్ష్యాలకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసే బాధ్యతను యంత్రాంగం నిబద్దతతో ముందుకు తీసుకువెళ్లాలి.. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో రావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version