AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు

Ap Liquor Scam Ed

Ap Liquor Scam Ed

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.. ఈ కేసులో చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్‌చార్జ్‌, గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. విజయానందరెడ్డి నిఖిలానంద లాజిస్టిక్స్‌ ద్వారా మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టు నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ పేర్కొన్నట్లు సమాచారం. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి సబ్‌కాంట్రాక్టులు పొందినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. నిఖిలానంద లాజిస్టిక్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించినట్లు సమాచారం.

నిఖిలానంద లాజిస్టిక్స్‌ ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. సిగ్మా, ప్రసాద్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌ సంస్థల నుంచి నిఖిలానంద లాజిస్టిక్స్‌ ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నిధులను వివిధ మార్గాల్లో మళ్లించినట్లు అనుమానిస్తున్న ఈడీ.. మనీలాండరింగ్‌ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయానందరెడ్డి వాంగ్మూలాన్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదు చేయనున్నట్లు సమాచారం. నిఖిలానంద లాజిస్టిక్స్‌ కార్యకలాపాలు, సబ్‌కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులు ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది.

గతంలో విజయానందరెడ్డికి చెందిన నిఖిలానంద అపార్ట్‌మెంట్‌లో సిట్‌ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఒకే కార్యాలయం నుంచి పలు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించినట్లు సిట్‌ గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహిత్‌రెడ్డి, విజయానందరెడ్డికి చెందిన సంస్థలకు సంబంధించిన అంశాలపైనా దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టుల ద్వారా వచ్చిన నిధులను వివిధ మార్గాల్లో రూటింగ్ చేసినట్లు సిట్‌ గుర్తించిన అంశాలపై కూడా ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. సబ్‌కాంట్రాక్టుల ద్వారా భారీగా ఆర్థిక లబ్ధి పొందినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ అంశాల్లో తుది నిర్ధారణ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, ఏపీ మద్యం రవాణా వ్యవహారంలో టెండర్లు, కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, నిధుల లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వ్యక్తులను విచారించడంతో పాటు కీలక నిందితులపై చర్యలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.