AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. వీరి అరెస్టు నుంచి ఇప్పటివరకు ఉన్న రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే, ఈ ముగ్గురు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్‌పై ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ, ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు..
Read Also: Kavitha: “వాళ్ళిద్దరూ ఒక్కటే.. కలిసే ఉన్నారు”.. కవిత కీలక వ్యాఖ్యలు..
అయితే, డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఇదే సమయంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు మాత్రం నిరాకరించింది. హైకోర్టు తీర్పును నిలబెట్టినప్పటికీ, నిందితులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ తదుపరి చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. రెగ్యులర్ బెయిల్ అంశాన్ని ట్రయల్ కోర్టు పరిధిలోనే పరిష్కరించాలని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు లిక్కర్ కేసులో కీలక మలుపుగా మారాయి. ఈ కేసు తదుపరి దశలో ఎలా కొనసాగుతుందనే అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
