Site icon NTV Telugu

AP Health Department: గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా.. ఆరోగ్యశాఖ కీలక ఒప్పందం

Ap Drone Medicine Delivery

Ap Drone Medicine Delivery

AP Health Department: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో వినూత్న ముందడుగు వేసింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేయాలని నిర్ణయించింది ఆరోగ్యశాఖ.. ఇందుకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఓ ప్రైవేట్ సంస్థతో చేసుకుంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్‌ మెడిసిన్‌ డెలివరీ సేవలను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఒప్పందం ప్రకారం, వచ్చే నెలాఖరు నుంచి గిరిజన ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా అధికారికంగా ప్రారంభం కానుంది.

Read Also: Yogi Adityanath: “గాజా” కోసం కన్నీరు కారుస్తారు, “బంగ్లాదేశ్ హిందువు” కోసం మాట్లాడరు…

ప్రస్తుతం పాడేరును హబ్‌గా చేసుకుని సేవలు ప్రారంభించినప్పటికీ, భవిష్యత్తులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) నుంచి పాడేరుకు ఈ డ్రోన్ సేవలను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు తెలిపారు. డ్రోన్ల ద్వారా మందుల సరఫరాతో.. దూర ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆస్పత్రులకు అత్యవసర మందులు వేగంగా చేరే అవకాశం ఏర్పడనుంది. కొండ ప్రాంతాలు, రహదారి సౌకర్యం సరిగా లేని ప్రాంతాల్లో సైతం.. సమయానికి మందులు అందుబాటులోకి రావడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ఆరోగ్య వ్యవస్థలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు.. సేవల వేగం, నాణ్యత పెరుగుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజలకు సకాలంలో వైద్య సాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొంది.

Exit mobile version