Nethanna Bharosa: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. త్వరలో ‘నేతన్నల సేవలో’ పథకం కింద రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతోందని వెల్లడించారు. రెండో విడత ఆర్థిక సాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా 36,632 దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక గడువును ఈ నెల 3వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, పారదర్శకంగా అర్హులను గుర్తిస్తున్నట్లు వివరించారు.
ఇక, అర్హత ఉన్న ఏ ఒక్క నేతన్నకూ అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు మంత్రి సవిత.. అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి నేతన్నకూ ఆర్థికంగా మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే త్వరలో కొత్త పెన్షన్లు కూడా అందించనున్నట్లు వెల్లడించారు మంత్రి సవిత..

