Mustabu Hygiene Program: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Read Also: India T20 World Cup 2026 Squad: నేడు టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ కష్టమేనా?
పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ముస్తాబు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగా, అక్కడ సత్ఫలితాలు కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, వారి రోజువారీ అలవాట్లను పర్యవేక్షించడం, క్రమశిక్షణను పెంపొందించడం, మంచి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఈ కార్యక్రమం అమలు చేసే విధానం, పాటించాల్సిన నియమాలు, విధివిధానాలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ వెంటనే అమల్లోకి తేవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
