AP Government: వడ్డెరలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వడ్డెరల కోసం ప్రభుత్వ భూములను క్వారీ పూల్‌గా గుర్తించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 100 హెక్టార్ల ప్రభుత్వ భూములను క్వారీ పూల్‌గా అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 32 ప్రాంతాల్లో క్వారీల కోసం ప్రభుత్వ భూములను గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గుర్తించిన ప్రాంతాల్లో రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజులు కేటాయించనున్నారు. దీంతో వడ్డెర సహకార సంఘాలకు క్వారీ కార్యకలాపాల ద్వారా ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా క్వారీ లీజులకు సంబంధించిన అమౌంట్, సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో వడ్డెర సంఘాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించడంతో పాటు, వారి జీవనోపాధికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.

