AP Model Code of Conduct: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు..
కొత్త పథకాలు, ప్రాజెక్టులకు అనుమతి లేదు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించడం, కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. కొత్త ప్రమోషన్లు, బదిలీలు చేపట్టడానికి కూడా అనుమతి ఉండదని వెల్లడించింది. ఇక, ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను పాత ఎలక్టోరల్ రోల్స్ ఆధారంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియను అమలు చేయాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాల్సి ఉన్నందున ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లనున్నట్లు వివరించారు.
భద్రత కోసం ప్రత్యేక చర్యలు
ఎన్నికల నిర్వహణలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఒక ఐజీ స్థాయి అధికారి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద విధులు నిర్వహిస్తారని వెల్లడించారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా. అదనపు భద్రత కోసం పారా మిలిటరీ బలగాలను అందించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు తగిన రక్షణ కల్పించాలని ఆదేశించారు.
బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకుంటే చర్యలు
ఎన్నికల్లో ఎక్కడైనా అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి లేదా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. సంబంధిత రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. మొత్తంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుతో కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ప్రమోషన్లు, బదిలీలపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అభ్యర్థులకు భద్రత కల్పించడం, ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయడం, నామినేషన్ల ఉపసంహరణలో అక్రమాలను అరికట్టడం వంటి అంశాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
కాగా, రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు అక్టోబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వీటిలో 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఎన్నికలకు అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్ 26తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
ఇక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కల్పించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నవంబర్ 11 నాటికి ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు.. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికలకు నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక, రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. మూడో దశ ఎన్నికలకు నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

