Site icon NTV Telugu

AP District Reorganization: జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం.. మార్పులు.. చేర్పులు ఇవే..

Ap District Reorganization

Ap District Reorganization

AP District Reorganization: జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు.. చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా… దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా… వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

Read Also: Indians deportation: యూఎస్‌తో పోలిస్తే, ఈ ముస్లిం దేశమే భారతీయుల్ని ఎక్కువగా బహిష్కరించింది..

నెల్లూరు జిల్లాకే తిరిగి 5 మండలాలు..
గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. అలాగే, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్‌ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు…ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు.

ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ప్రాంతాలు యథావిధిగానే…
* శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చడం..
* అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు మార్చడం..
* కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు మార్చడం..
* అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయడం.
* కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు… ప్రకాశం జిల్లాలో విలీనం
* కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు.. కందుకూరు డివిజన్‌లోని మిగిలిన రెండు మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లోకి మార్పు..
* పలమనేరు డివిజన్‌లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్‌కు మార్పు..
* చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్చడం
* చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌కు మార్పు
* శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
* కదిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆమదగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం
* పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్పు చేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version