AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతులు, గృహ నిర్మాణం, విద్యుత్, పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
వైద్యం, విద్య, క్రీడలకు ప్రాధాన్యం
చిత్తూరు జిల్లా పలమనేరులో లైవ్‌స్టాక్‌కు సంబంధించి 33 ఎకరాల భూమి బదలాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే విధంగా పలమనేరు ఏఎంసీకి కూడా 33 ఎకరాల భూమి బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 420కి పెంచడంతో పాటు 837 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెటిక్స్ క్రీడాకారిణి ఎర్రాజు జ్యోతికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం, ఆర్థిక సాయం, గ్రూప్–1 ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్..
గృహాలు, సంక్షేమ పథకాలు
ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,450 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పీఎంఏవై 1.0 కింద ఉన్న ఇళ్లను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలలో కేంద్రం నుంచి కొత్త ఇళ్ల మంజూరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2028 నాటికి ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మరోవైపు.. అమరావతిలో వీధిపోటు వచ్చే 120 మంది రైతులకు ప్లాట్ల మార్పుల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో భూమిలేని పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్‌ను తల్లిదండ్రులు లేని పిల్లలకూ వర్తింపజేయాలని నిర్ణయించింది.
భూకేటాయింపులు, పరిశ్రమలు, మౌలిక వసతులు
తిరుపతిలో 2019లో గార్డెన్ సిటీ రియాల్టీ కంపెనీకి ఇచ్చిన ఎల్‌ఓఐని రద్దు చేస్తూ, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించేందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ద్వారకా తిరుమలలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపింది. సోలార్ పవర్ కార్పొరేషన్‌కు వివిధ ప్రాంతాల్లో మెగా సోలార్ ప్రాజెక్టుల కోసం భూములను లీజుకు ఇవ్వడానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. రిలయన్స్ సంస్థకు 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములను లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.15 వేల చొప్పున లీజు చెల్లింపుల ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసిలో మెగా టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటుకు ఎకరాకు రూ.7.5 లక్షల చొప్పున భూముల కేటాయింపుకు ఆమోదం లభించింది. రామాయపట్నం పోర్టు అభివృద్ధి కోసం రాపూరు, చేపూరు ప్రాంతాల్లో మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు చేసి భూసేకరణ చేయాలని నిర్ణయించింది.
పోలవరం, విద్యుత్, టీటీడీ అంశాలు
పోలవరం ప్రాజెక్టులోని పలు పనులను మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగిస్తూ, కొండను తవ్వి రాయి వినియోగంతో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.247 కోట్ల పనులను మెగా ఇంజినీరింగ్‌కు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్–2025 చట్టసవరణ బిల్లును వచ్చే శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది. టీటీడీలో మూడు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని, అయితే జంతువుల కొవ్వు కలిసిందా లేదా అన్నది దర్యాప్తు నివేదికలో తేలుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వానికి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అన్ని అంశాలను స్పష్టంగా వెల్లడిస్తామని చెప్పారు.
