AP Land Market Value Hike: ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువ మరోసారి పెరిగింది.. సవరించిన భూముల మార్కెట్ విలువలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టింది సర్కార్. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15 శాతం కంటే ఎక్కువగా పెంచిన విషయం తెలిసిందే.. కాగా, భూముల మార్కెట్ విలువ పెంపుతో ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
భూముల మార్కెట్ విలువ పెంపు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో భూముల కొనుగోలు, విక్రయాల సమయంలో ఎక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, భూముల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలకంగా మారనుందని విశ్లేషిస్తున్నారు.
