Site icon NTV Telugu

Amaravati Second-Phase Land Pooling: రెండో దశ ల్యాండ్ పూలింగ్.. ఆ 7 గ్రామాల్లో రేపటి నుంచే..

Amaravati

Amaravati

Amaravati Second-Phase Land Pooling: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ రాజధాని అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయి.. ఇక, రాజధాని ప్రాంతం అమరావతిలో రేపటి (జనవరి 7) నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దశలో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 7 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) భూ సమీకరణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనున్న ప్రభుత్వం, రాజధానిలో కీలక మౌలిక వసతుల నిర్మాణానికి ఈ భూసేకరణ చేపడుతోంది. ఇందులో: పట్టా భూమి: 16,562 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూమి: 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి: 3,828 ఎకరాలుగా ఉండనుంది..

రెండో దశ భూ సమీకరణ జరగనున్న గ్రామాలు ఇవే..
* వైకుంఠపురం
* పెద్ద మద్దూరు
* ఏండ్రాయి
* కర్లపూడి
* వడ్లమాను
* హరిశ్చంద్రపురం
* పెద్ద పరిమి

అయితే, మొదటి దశలో ఇప్పటికే 34,400 ఎకరాల భూమిని విజయవంతంగా ల్యాండ్‌ పూలింగ్ ద్వారా సమీకరించింది ప్రభుత్వం, ఇప్పుడు రెండో దశను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈసారి భూసేకరణను ప్రాజెక్టుల వారీగా విభజించి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో నిర్మించబోయే ప్రధాన ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ జరుగుతోంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, కొత్త రైల్వే లైన్ అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్‌ఫ్రా కారిడార్ అనుసంధాన పనుల కోసం ఈ ల్యాండ్‌ పూలింగ్‌ అంటున్నారు.. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇకపై ప్రతి అభివృద్ధి ప్రాజెక్టుకు అవసరమైన భూములను ప్రత్యేకంగా గుర్తించి సమీకరించనున్నారు. భూసేకరణ ప్రక్రియలో గ్రామస్థులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శక విధానం పాటిస్తామని అధికారులు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, రెండో దశ ల్యాండ్ పూలింగ్ రాజధాని మౌలిక వసతుల కలను మరింత ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా నిలవనుంది.

Exit mobile version