CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..

Amaravati

Amaravati

CRDA: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో గ్రామకంఠం మినహాయింపుల అంశంపై ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కీలక స్పష్టత ఇచ్చింది. గ్రామకంఠం మినహాయింపులకు 2014 డిసెంబర్ 8ను కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ తేదీకి ముందే నిర్మాణాలు ఉన్న భూములకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, 2014 డిసెంబర్ 8 తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా గ్రామకంఠం మినహాయింపు ఇవ్వబోమని CRDA పేర్కొంది. కటాఫ్ తేదీకి ముందు ఉన్న నిర్మాణాలు, సంబంధిత రికార్డులను ఆధారంగా చేసుకుని అర్హతను నిర్ణయించనున్నట్లు తెలిపింది.

6,473 ఎకరాలకు మినహాయింపు
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) నుంచి ఇప్పటికే 6,473.72 ఎకరాలను మినహాయించినట్లు CRDA వెల్లడించింది. ఇంకా పరిష్కారం కాని దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక, అపరిష్కృతంగా ఉన్న 685 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నట్లు CRDA తెలిపింది. ఇందుకోసం సంబంధిత భూముల రికార్డులతో పాటు శాటిలైట్ చిత్రాలను కూడా పరిశీలనలో భాగంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

జాయింట్ కలెక్టర్ కమిటీ నిర్ణయం
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హతపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకోనుంది. నిబంధనలకు అనుగుణంగా అర్హత పొందిన రైతులకు గ్రామకంఠం మినహాయింపుతో పాటు వర్తించే అన్ని ప్రయోజనాలను అందిస్తామని CRDA స్పష్టం చేసింది. గ్రామకంఠం మినహాయింపుల విషయంలో కటాఫ్ తేదీ, నిర్మాణాల వివరాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని CRDA తెలిపింది.