Site icon NTV Telugu

Minister Narayana: అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు.. అధికారంలోకి వచ్చాక భయభ్రాంతులకు గురిచేశారు..!

Minister Narayana

Minister Narayana

Minister Narayana: అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నవారే ఆ తర్వాత మాట మార్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని మండిపడ్డారు మంత్రి నారాయణ.. అసెంబ్లీలో మాట్లాడుతూ… అమరావతి రాజధాని అంశంపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతినే రాజధానిగా అంగీకరించిన వారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రజల్లో భయభ్రాంతులను సృష్టించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 34 వేల ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతోనే రైతులు తమ భూములను సమర్పించారని ఆయన పేర్కొన్నారు.

Read Also: Chicken Prices Drop: నాన్‌వెజ్‌ ప్రియులకు నోరూరాల్సిందే.. అమాంతం పడిపోయిన చికెన్‌ ధరలు..!

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా జస్టిస్ సిటీ, మీడియా సిటీ, హెల్త్ సిటీ వంటి విభాగాలతో మొత్తం 9 ప్రత్యేక నగరాల నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు. అదనంగా 23 టౌన్‌షిప్‌ల అభివృద్ధి కూడా ప్రణాళికలో భాగంగా కొనసాగుతోందన్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతినే రాజధానిగా అంగీకరించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. రోజుకో ప్రకటన చేస్తూ ప్రజల్లో అయోమయం, భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై లాఠీచార్జీలు చేయించడం, పాదయాత్రలు చేపట్టిన వారిని అరెస్ట్ చేయించడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

ఇక, శివరామకృష్ణ కమిటీ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కమిటీ రాజధాని స్థానం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని చెప్పారు నారాయణ. దాని ఆధారంగా 2014 సెప్టెంబర్ 3న గుంటూరు–విజయవాడ మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. 2014 నుంచి 2019 మధ్య అమరావతి నిర్మాణ పనుల కోసం సుమారు రూ.41,170 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని, కానీ తరువాతి ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను నిలిపివేసి నష్టపరిచిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించామని, మధ్యలో నిలిచిపోయిన భవనాల నాణ్యతను పరిశీలించి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అమరావతిని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..

Exit mobile version