Tribal Struggles: స్వాతంత్య్రం వచ్చిన 78 సంవత్సరాలు తర్వాత కూడా గిరిజన ప్రజల జీవితం ఇప్పటికీ కష్టాలతో నిండిపోయింది. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని మారుమూల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన దీనికి నిదర్శనం. చిట్టి అడవిలో, చిమ్మ చీకటిలో, వర్షం కురుస్తున్న సమయంలో.. సెల్‌ఫోన్ వెలుతురులోనే ఓ గర్భిణీ ప్రసవించింది. స్త్రీ రవ్వ దేవమ్మ అనే గిరిజన మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆశ వర్కర్ 108కు కాల్ చేసింది. అయితే, 10 కిలోమీటర్ల వరకు రోడ్డు బాగానే ఉండటం, ఆ తరువాత బురదమయం, గోతులతో నిండిపోయిన దారిలో అంబులెన్స్ ముందుకు రాలేకపోయింది.
Read Also: Talk Of The Town : బడ్జెట్ రూ. 30 కోట్లు.. వసూళ్లు రూ. 200 కోట్లు..
ఇక, ఇలాంటి పరిస్థితిలో EMT రామ్మోహన్‌రావు, ఆశ వర్కర్ లక్ష్మీ వర్షంలో తడుస్తునే, చీకటిని లెక్కచేయకుండా కాలినడకన కన్నాపురం చేరుకుని గర్భిణీని అంబులెన్స్ దగ్గరకు తీసుకు వస్తుండగానే మార్గమధ్యంలోనే నొప్పులు పెరగడంతో అడవి మధ్యలో చిమ్మ చికటీలోనే ప్రసవించింది. కేవలం సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులోనే కష్టసాధ్యమైన పరిస్థితుల్లో రవ్వ దేవమ్మ ఆరోగ్యంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత తల్లీబిడ్డలను కూనవరం PHCకి తరలించారు. కాగా, ఆశ వర్కర్ లక్ష్మీ, EMT రామ్మోహన్‌రావు, పైలట్ రవితేజ సమన్వయంతో ఈ కాన్పు సక్సెస్ అయింది.
అయితే, ఇదే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పింజరికొండ గ్రామానికి చెందిన ఓ బాలుడు రేబిస్ వ్యాధి బారిన పడ్డాడు. వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నా.. తల్లిదండ్రులు ప్రాణాల పణంగా పెట్టి కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, చికిత్స ఫలించకపోవడంతో బాలుడు చనిపోయాడు. మరణానంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా బీభత్సంగా పొంగిపోర్లుతున్న వాగును దాటాల్సి వచ్చింది. అంబులెన్స్ అక్కడి వరకు మాత్రమే వెళ్లింది.. ఆ తర్వాత తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి స్ట్రెచర్‌పై మృతదేహాన్ని మోసుకెళ్లిన దృశ్యాలు కన్నీరు తెప్పిస్తున్నారు. ఈ రెండు ఘటనలు చాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి వెలుగులోకి తీసుకు రావడానికి.. గిరిజన గ్రామాలకు రోడ్లు, రవాణా, ఆరోగ్య సదుపాయాలు కల్పించడంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
