Encounter in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.. ఏకంగా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా వెల్లడించారు.
Read Also: Phone Tapping Case: నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ..
ఈరోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాప్పులు జరిగినట్లు సమాచారం. మృతులలో ఒకరు మావోయిస్టుల అగ్రనేతగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం.. ఇటీవలి రోజులుగా ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్‌కు కీలక సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇక, ఎదురు కాల్పుల తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సులు ఇంకా అడవుల్లో తీవ్ర కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, స్టాకింగ్ మెటీరియల్ ఉన్న అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలపరిచాం. మిగిలిన మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని ప్రకటించారు.. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజలు అడవుల్లో వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..
