కొనసాగుతున్న ‘జాంబిరెడ్డి’ హవా!

కరోనా సెకండ్ వేవ్ తో జనం సతమతమౌతుంటే… కరోనా టైమ్ లోనే తెరకెక్కిన ‘జాంబిరెడ్డి’ మూవీ మాత్రం విజయ పరంపరను కొనసాగిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలై రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. ఆ తర్వాతి నెల మార్చి 26న ఆహాలో ఇది స్ట్రీమింగ్ అయ్యింది. అక్కడ కూడా వీక్షకుల నుండి చక్కని స్పందనే ‘జాంబిరెడ్డి’కి లభించింది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే మార్చి 28న ఈ మూవీని స్టార్ మా ఛానెల్ ప్రసారం చేసింది. అప్పుడు దీనికి 9.7 టీఆర్పీ దక్కింది.
ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిపోవడంతో జనాలకు ప్రధాన వినోద సాధనం ఓటీటీ, టీవీ ఛానెల్సే అయ్యాయి. దాంతో తాజాగా మరోసారి స్టార్ మా ఛానెల్ ‘జాంబిరెడ్డి’ చిత్రాన్ని ప్రసారం చేసింది. ఈసారి కూడా ఆదరణ చెక్కచెదరలేదు. సెకండ్ టైమ్ ఈ చిత్రానికి 8.1 టీఆర్పీ వచ్చినట్టు ఛానెల్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలోనూ, ఓటీటీలోనూ విడుదలైన సినిమాకు, ఇంత తక్కువ గ్యాప్ లో రెండో ప్రసారంలో ఈ స్థాయి టీఆర్పీ రావడం విశేషమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే… తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇష్క్’ ఏప్రిల్ 23న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. మరి తేజా సజ్జా ‘జాంబిరెడ్డి’కి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ‘ఇష్క్’ నిర్మాతలు సైతం ఓటీటీకి వెళతారా, థియేటర్లు తెరుచుకునేంత వరకూ ఆగుతారా అనేది చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-