చంద్రబాబు.. అనావృష్టి..ఓ జగన్ సెటైర్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం మొత్తం రోడ్ల చుట్టే తిరుగుతోంది. రోడ్ల సమస్యను ఎత్తిచూపే క్రమంలో టీడీపీ.. జనసేన పార్టీలు జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ దిగుతున్నారు. ఏపీలోని అధ్వాన్న రహదారులపై నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా రోడ్ల నిర్మాణలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రోడ్లను కేరాఫ్ చేసుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తుండటంతో దీనికి చెక్ పెట్టేలా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేపట్టారు. దీనిలో భాగంగా నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో రోడ్లు-భవనాల శాఖ.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వర్షాకాల సీజన్లో ఏ ప్రభుత్వం కూడా రోడ్డు వేయదని తెల్సినా కొంతమంది రాజకీయ దురుద్దేశ్యంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటాన్ని జగన్ తప్పుబట్టారు. అక్టోబర్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయని ఆ తర్వాత రోడ్ల నిర్మాణాలను చేపడుతామని స్పష్టం చేశారు. ఈమేరకు రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలువాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వాటి నిర్మాణానికి కూడా జగన్ సర్కారు డెడ్‌లైన్ విధించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్లు అవసరమో వాటన్నింటిని టెండర్లు పిలువాలని అధికారులకు సూచించారు. వచ్చే వర్షాకాలం నాటి కల్లా రోడ్లన్నింటిని బాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి నుంచి నివేదకలు తెప్పించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను విస్మరించిందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో దాదాపుగా తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లను కొత్తగా నిర్మించింది. అయితే ఈ ఏడాది వర్షాలు విస్తారంగా పడుతుండటంతో వేసిన రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణాలకు టెండర్లను పిలిచింది. అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే సర్కారు ఆదేశాలను జారీ చేసింది. వీటి కోసం ప్రభుత్వం ఏకంగా 6వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం వర్షకాల సీజన్ కావడంతో రోడ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో అక్టోబర్ నెలలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయింది. వర్షకాలంలో ఏ ప్రభుత్వం రోడ్లు వేయదని తెల్సిన టీడీపీ, జనసేన పార్టీలు ఇదే అదనుగా రాజకీయానికి పాల్పడుతున్నాయి. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక చంద్రబాబు హయాంలో ఏనాడూ వర్షాలు సరిగా పడిన దాఖలాలు లేవు. దీంతో ఆయన ఎప్పుడో వేసిన రోడ్లు అలాగే ఉన్నాయని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కొత్తగా వేసిన రోడ్లు సైతం చాలావరకు డ్యామేజ్ అవుతున్నాయి. దీంతో రోడ్ల మరమ్మతులను ప్రభుత్వం మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. అదే అదనుగా కొందరు రాజకీయ దురుద్దేశంతో జగన్ సర్కారుపై బురదజల్లే ప్రయత్నాలు జనసేన, టీడీపీ చేస్తున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ దీనిపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దీనిని వైసీపీ శ్రేణులు సైతం అదే స్థాయిలో తిప్పికొడుతున్నాయి. దీంతో రోడ్లపై జరుగుతున్న రాజకీయం ఏపీలో ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-