తండ్రి బాటలో తనయ.. అప్పటి పరిస్థితి ఉందా..?

తెలంగాణలో పాదయాత్రల పరంపర మొదలైంది.. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తొలి విడత పాదయాత్ర ముగియగా.. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు మరో మహా పాదయాత్రకు రంగం సిద్ధమైంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. నేటినుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. తండ్రి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ… చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. 90 నియోజకవర్గాల మీదుగా 400 రోజులు పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్లమేర సాగనుంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిదన్నరకు పాదయాత్ర మొదలై, సాయంత్రం ఆరింటి వరకు యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగిసిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు షర్మిల.

అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2003లో ఇక్కడి నుంచే పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా తిరుగుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ముందుకుసాగారు.. ఆ తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం జరిగిపోయాయి.. ఇక, ఆ తర్వాత ఇప్పటి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు.. అయితే, కేసులు, జైలు జీవితంతో.. ఆ బాధ్యతను అందుకున్న వైఎస్‌ షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. వైఎస్‌ జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు పాదయాత్ర కొనసాగించారు.. ఆ తర్వాత పాదయాత్రను కొనసాగించిన వైసీపీ అధినేత.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని ఛేజిక్కించుకున్నారు.. అంటే, జగన్‌ విజయం వెనుక షర్మిల పాదయాత్ర ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఇక, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు వైఎస్‌ షర్మిల.. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించబోయే పాదయాత్రలో భాగంగా ఆమె 4 వేల కిలోమీటర్ల నడిచి తిరిగి చేవెళ్లలోనే ముగించాలని నిర్ణయించారు..

హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధి మినహా 16 స్థానాలను చుట్టేలా ప్లాన్‌ చేశాయి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ శ్రేణులు.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం.. 2003 మండువేసవిలో ఆయన పాదయాత్ర చేయటం ఒక సాహసం.. ఆనాడు వైఎస్‌ పాదయాత్ర ఒక ప్రభంజనాన్నే సృష్టించింది.. ఇప్పుడు ఆయన కూతురు షర్మిల పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రభుత్వ అసమర్థతపై ధ్వజమెత్తేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయా? అనేదే చర్చగా మారింది.. అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే.. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది.. అధికార టీఆర్ఎస్‌పై ఓవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేవంత్‌ రెడ్డి దాడి చేస్తుంటే.. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా దూకుడు చూపిస్తున్నారు. ఈ తరుణంలో షర్మిల పాదయాత్ర ప్రభావం ఏపాటిది? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. కార్యక్రమాలు చేస్తున్న షర్మిల.. ప్రతీ వారం నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తూ వచ్చారు. వాటికి అంత స్పందన కూడా రాలేదు అనేది పొలిటికల్‌ సర్కిల్‌లో సాగే చర్చ.. కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి ప్రజలను దీక్షలకు తెచ్చారనే వార్తలు కూడా వైరల్‌ అయ్యాయి.. కానీ, ఇప్పుడు ఆమె చేపడుతోన్న పాదయాత్ర ఎలాంటి కదలిక తేనుంది.. ప్రజలు ఆమె వెంట నడుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌కు కలిసివచ్చిన తరహాలో.. షర్మిలకు కూడా అనుకూల పరిస్థితులు మాత్రం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

Related Articles

Latest Articles