రైతన్నలకు కడుపు మండింది.. అందుకే ప్రధానికి చుక్కలు చూపించారు: షర్మిల

పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.

Read Also: నాడు గ్రాఫిక్స్ అని తిట్టి… నేడు భూములు తాకట్టు పెట్టబోతున్నారు: సోమిరెడ్డి

వ్యవసాయంపై కేంద్రం అనుసరిస్తున్న విధానం, మద్దతు ధర ఇవ్వకపోవడం, చట్టాలు వంటి అంశాల నేపథ్యంలోనే ప్రధాని మోదీని రైతులు అడ్డుకుని.. చివరకు వెనక్కి పంపించారని షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ రైతులే రేపు సీఎం కేసీఆర్ అధికారం పట్ల కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం రైతుకు చితి పేర్చుతోందని… వీధిన పడ్డ రైతుకు అండగా తాము రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతున్నామని షర్మిల అన్నారు. అయితే తమ రైతు ఆవేదన యాత్రను ఆపడానికి కేసీఆర్ ప్రభుత్వం కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ చేతకాని సీఎం మనకొద్దని షర్మిల పేర్కొన్నారు.

Related Articles

Latest Articles