‘నాన్నకు ప్రేమతో’.. ఒక్కటైన జగన్- షర్మిల

వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు.. కానీ రాజకీయం ఆ అన్నాచెల్లెలును వేరుచేసింది. చెరో రాష్ట్రంలో చెరో దిక్కుగా విడిపోయారు. చెల్లెలి కోరిక అన్నకు నచ్చలేదు. కానీ రాజకీయ వారసత్వాన్ని చెల్లి కొనసాగించాలనుకుంది.. బంధం దూరమైనా ఆ తండ్రి చూపిన దారి మాత్రం వారిద్దరిని కలిపింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు ఆయన బిడ్డలు వైఎస్ జగన్, షర్మిల కలిసిపోవడం వైఎస్ అభిమానులకు కన్నుల పండువగా మారింది

ఈ పరిణామం కంటే ముందు చాలా విషయమే జరిగింది. సీఎం జగన్, వైఎస్ షర్మిలకు మధ్య తారాస్థాయిలో విబేధాలు వచ్చాయనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగింది. షర్మిల తెలంగాణలో తన తండ్రి పేరిట ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టడమే వివాదానికి కారణమైందని అన్నారు. షర్మిల కొత్త పార్టీ వైఎస్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే షర్మిల ప్రారంభించిన రాజకీయ పార్టీకి ఆమె తల్లి విజయమ్మ పూర్తి మద్దతు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె మరోపార్టీకి మద్దతు ఇవ్వడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ సీఎం జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. షర్మిలతోనే విజయమ్మ నడుస్తుండటంతో వైఎస్ఆర్ కుటుంబంలో సీఎం జగన్ ఏకాకిగా మారరంటూ ప్రత్యర్థులు ఓ రేంజులో ప్రచారం చేశారు.

దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని కొందరు చూస్తున్నారు. ఈక్రమంలోనే వైఎస్ఆర్ 12వ వర్ధంతి రావడంతో అందరి దృష్టి వైఎస్ఆర్ కుటుంబంపై పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మునుపటిలా ఒకే వేదిక నుంచి తమ తండ్రికి నివాళులు అర్పిస్తారా? లేదంటే ఎవరికీ వారు విడివిడిగా తమ తండ్రికి నివాళులు అర్పిస్తారా? అనే చర్చ కొద్దిరోజులుగా నడుస్తోంది.

వీటన్నింటినికీ వైఎస్ఆర్ ఘాట్ నేడు సమాధానం ఇచ్చింది. ఇడుపుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా అన్నచెల్లెల్లు ఒకటయ్యారు. ఒకే వేదికపైకి వచ్చి పక్కపక్కనే ఉండి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ఒక్క సీనే ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలిచింది. తమ మధ్య కేవలం రాజకీయ విబేధాలు తప్ప ఫ్యామిలీ పరంగా ఎలాంటి గొడవలు లేవనే సంకేతాలు బయటికి పంపించినట్లు కన్పిస్తుంది.

అయితే గతంలోలాగా అంత క్లోజ్ రిలేషన్ మాత్రం కనిపించ లేదు. ప్రతీయేటా క్రిస్మస్ వేడుకలను కలిసే జరుపుకొనే జగన్ కుటుంబ సభ్యులు గతేడాది కరోనా కారణంగా కలువడం లేదు. అదేవిధంగా ఈసారి రాఖీ పండుగకు జగన్ కు షర్మిల కేవలం ట్వీటర్ లోనే విషెస్ చెప్పారు. దీంతో వీరిమధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. దీనికితోడు షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుతో వైఎస్ జగన్, షర్మిల చెరోదారి చూసుకున్నారనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది.

ఈ పుకార్లన్నింటికీ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ చెక్ పెట్టింది. తమ మధ్య రాజకీయంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా..అన్నా- చెల్లెలుగా ఒక్కటిగా తండ్రికి నివాళి అర్పించారు. ఇప్పుడు ఇదే తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా నేటి సాయంత్రం హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్సార్ 12వ వర్దంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, వైఎస్ఆర్ ఆప్తులకు ఆహ్వానం పంపారు.

జగన్ మాత్రం షర్మిల రాజకీయ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన చెల్లి వెనుక తాను ఉన్నాననే అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. దీంతో వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళానికి ఆయన దూరంగా ఉండబోతున్నారు. అదేవిధంగా జగన్ కు మద్దతుగా ఉన్న వారు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదని తెలుస్తోంది.

వైఎస్ఆర్ క్యాబినెట్లో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు- ఇతర రంగాల వ్యక్తులను దాదాపుగా 350 మందిని విజయమ్మ ఆహ్వానించినట్లు సమాచారం. వీరిలో ఎవరెవరు ఆ సభకు హాజరవుతారనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ పై ప్రేమతో అన్న.. చెల్లెలు ఒకే వేదికపైకి రావడంతో వైఎస్ఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నేటి సాయంత్రం వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనంలో విజయమ్మ ఏం మాట్లాడుతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-