వెంకీ నటనకు యువ నటులు ఫిదా!

విక్టరీ వెంకటేశ్ వెండితెరపై వినోదాన్నే కాదు, పగ ప్రతీకారాలనూ అద్భుతంగా ఆవిష్కరించగలడు. దానికి తాజా ఉదాహరణ ‘నారప్ప’. తన కొడుకును హతమార్చిన ఓ వర్గంపై నారప్ప అనే రైతు ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. అందులో కులం కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. వెట్రిమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. యంగ్ హీరో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేశ్ రక్తి కట్టించగలడా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేయకపోలేదు. దానికి ఇటీవల విడుదలచేసిన ట్రైలర్ తో దర్శక నిర్మాతలు సమాధానం చెప్పారు. వెంకటేశ్ ను ఆ ట్రైలర్ లో చూసిన టాలీవుడ్ ఆర్టిస్టులు ఆయన నటనకు ఫిదా అయిపోతున్నారు.

‘బిడ్డల తండ్రిగా, యువకుడిగా ఒకే సినిమాలో నటించడం కష్టమని, కానీ వెంకటేశ్ సునాయాసంగా ఆ పనిచేసినట్టు తెలుస్తోంద’ని ప్రముఖ నటుడు ‘వెన్నెల’ కిశోర్ వ్యాఖ్యానించాడు. గొప్ప నటనతో తమ పరిధులను పెంచుకునే వెంకటేశ్ లాంటి వ్యక్తులు ఉన్న చిత్రసీమలో భాగం కావడం గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్ పెట్టాడు. ఇక యంగ్ హీరో మంచు విష్ణు అయితే… ‘నారప్ప’ ట్రైలర్ చూడగానే గూజ్ బంప్స్ వచ్చాయని, యంగ్ అండ్ ఓల్డ్ నారప్ప గా వెంకీమామ ఇరగదీశాడని ట్వీట్ చేశాడు. ఎప్పటిలానే మణిశర్మ అదరగొట్టాడని, 20వ తేదీ కోసం ఎదురు చూస్తున్నానని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ‘నారప్ప’పై పలువురు సినీ ప్రముఖులు ఆసక్తి చూపడంతో మూడు రోజుల్లో జనం ముందుకు రాబోతున్న ఆ సినిమాపై క్రేజ్ అమాంతంగా పెరిగిపోతోంది.

వెంకీ నటనకు యువ నటులు ఫిదా!
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-