అప్పులు అందులోని తప్పులపై వైసీపీ, టీడీపీ ఫైట్‌…

అప్పులు అందులోని తప్పులపై వైసీపీ.. టీడీపీ మధ్య ఫైట్‌ జరుగుతోంది. పీఏసీ ఛైర్మన్‌ ఆరోపణల తర్వాత ఈ రగడ పీక్‌కు వెళ్లింది. ఇంతలో బీజేపీ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారా లేక.. రెస్క్యూకి వచ్చారా అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ కమలనాథుడి లేఖ ఆంతర్యం ఏంటి?

గవర్నర్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ రాసిన లేఖపై చర్చ!

ఏపీ ఆర్థిక వ్యవహారాలపై గవర్నర్‌ను కలిసి PAC ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 41 వేల కోట్ల నిధులకు సంబంధించి సరైన లెక్కలు లేవన్నది PAC ఛైర్మన్‌ ఆరోపణ. ఈ అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. CFMS విధానంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని.. గత ప్రభుత్వం తెచ్చిన కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ప్రభుత్వం కౌంటర్‌ ఇచ్చింది. ఈ గొడవ నడుస్తున్న సమయంలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు గవర్నర్‌కు లేఖ రాయడం ఆసక్తిగా మారింది. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలే చర్చకు దారితీస్తున్నాయి.

పాత విషయాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని కాపాడారా?

కేశవ్‌.. బుగ్గన మధ్య నడుస్తున్న ఫైనాన్స్‌ ఫైట్‌లో సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన బీజేపీ నేత జీవీఎల్‌.. ప్రభుత్వం 41 వేల కోట్లను వ్యక్తిగత పీడీ ఖాతాల్లో వేసి ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇది నిబంధనల ఉల్లంఘించడమేనన్నది ఆయన వాదన. అయితే ఇక్కడితో ఆగకుండా.. జీవీఎల్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇదే తీరున 53 వేల కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిందని ఆరోపించారు జీవీఎల్‌. అప్పట్లో తాను చేసిన ఆరోపణలను.. నాటి గవర్నర్‌కు రాసిన లేఖను ప్రస్తావించారు. అంటే.. ఈ విధంగా నిధుల మళ్లింపు.. నిబంధనలకు విరుద్ధంగా వినియోగం గతంలో నుంచి ఉందని జీవీఎల్‌ పరోక్షంగా చెప్పారా? అసలు బీజేపీ నేత లక్ష్యం ఏంటన్నది ఆసక్తిగా మారింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారా? లేక పాత విషయాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని రెస్క్యూ చేయడానికి వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయట.

అప్పుడు చిన్న విషయం.. ఇప్పుడు పెద్ద పాపంగా ఎలా మారింది?

జీవీఎల్‌ లేఖ వెనక వేరే కారణాలు కూడా ఉన్నాయని చెపుతున్నారు బీజేపీ నేతలు. నాడు ఇదే తప్పును ప్రశ్నిస్తే.. అప్పటి ప్రభుత్వం సరిగా స్పందించలేదని.. దాన్నో చిన్న విషయంగా కొట్టి పారేసిందని గుర్తు చేస్తున్నారు కమలనాథులు. అప్పుడు చిన్న విషయమైన లెక్క.. ఇప్పుడు పెద్ద పాపంగా ఎలా మారుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఆర్థిక రచ్చ నుంచి కాపాడటానికే వెళ్లారని కొందరు అభిప్రాయపడుతున్నారట. ఏది ఏమైనా.. ఫైనాన్స్‌ ఫైట్‌లో బీజేపీ ఎంపీ సడెన్‌ ఎంట్రీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ట్విస్ట్‌ ఇచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-