వైసీపీ ‘దూకుడు’.. తగ్గెదేలే..!

వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. కరోనా ఎంట్రీతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ఏపీలో సంక్షేమ పథకాలు ఏమాత్రం ఆగలేదంటే ఆ క్రెడిట్ మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. ఇలాంటివి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు సంయమనం కోల్పోయి వైసీపీపై బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

కొద్దిరోజులుగా ఏపీలో రాజకీయాలు బూతుమాటలు లేకుండా సాగడం లేదంటే అతిశయోక్తి కాదమో. టీడీపీ నేతలు పదేపదే వైసీపీ నేతలను రెచ్చగొడుతుండటంతో అధికార పార్టీ స్థాయి అదే రేంజులో కౌంటర్ ఇస్తోంది. ఇటీవల టీడీపీ నేత పట్టాబి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈక్రమంలో వైసీపీ అభిమానులు పట్టాభి ఇంటిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై సైతం దాడికి పాల్పడటం అగ్నికి అజ్యం పోసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. వైసీపీ దాడికి ఖండిస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో నిన్నంతా ఏపీలో అరెస్టులు, కేసులు, మాటలదాడులతో యుద్ధవాతావరణాన్ని తలపించింది. ఇక దీనికి మూలకారణమైన పట్టాబిని నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే వైసీపీ కూడా కౌంటర్ దీక్షలకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ క్రమంగా బలహీనమవుతోంది. వైసీపీకి 151 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా టీడీపీకి కేవలం 23మంది ఎమ్మెల్యే మద్దతు మాత్రమే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. అదేవిధంగా ఏపీలో ఎలాంటి ఎన్నిక జరిగిన వైసీపీనే ఏకపక్ష విజయాలు సాధిస్తూ వెళుతుంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ జీర్ణించుకోలేక టీడీపీ వైసీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు.

టీడీపీ నేతల మాటల దాడికి గట్టిగా తిప్పికొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈమేరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే టీడీపీ, వైసీపీ మధ్య ఓ రేంజులో మాటలయుద్ధం నడుస్తోంది. అయితే ఇది క్రమంగా అదుపుతప్పి దాడుల వరకు వెళ్లడం శోచనీయంగా మారింది. అయితే ఈ దాడికి తమకేమీ సంబంధం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. వైసీపీ సానుభూతి పరులు ఈ దాడికి పాల్పడ్డారని వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీడీపీ నేతల వైఖరిని ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది. దీంతో మున్మందు ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయనే సస్పెన్స్ నెలకొంది.

Related Articles

Latest Articles